పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని.. అసలు తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం ఏఐసిసికి తప్ప ఎసిసికి లేదని మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంపించారు మహేశ్వర్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరారు. నేడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయన పార్టీ మారడంపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
మహేశ్వర్ రెడ్డి చర్య సూసైడ్ వంటిదని అభివర్ణించారు మహేష్ కుమార్ గౌడ్. ఒక నాయకుడి కోసం త్యాగాలు చేసే రోజులు కావని చెప్పారు. చాలా రోజులుగా పార్టీ మారేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ అనుమానంతోనే ఆయనకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు మహేష్ కుమార్ గౌడ్. మహేశ్వర్ రెడ్డి పోతే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఇవి కేవలం బిజెపి ఆడుతున్న చిల్లర డ్రామాలు అని ఆరోపించారు.