టీడీపీకి ఆ ఒక్క ఎమ్మెల్యేనే మిగులుతాడా…?

-

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కీల‌క‌మైన జిల్లా విశాఖ‌లో రాజ‌కీయాలు మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా భారీ ఎత్తున సాగినా.. విశాఖ‌లో మాత్రం నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.  అలాంటి జిల్లాలో ఇప్పుడు పార్టీ కూసాలు క‌దిలిపోతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ నుంచి నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు గుర్రం ఎక్కిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. త్వ‌ర‌లోనే పార్టీ మార‌నున్నార‌ని జ‌గ‌న్ చెంత‌కు చేరనున్నార‌ని అంటున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా రెడీ అయింద‌ని అంటున్నారు. అయితే, ఆయ‌న ఒక్క‌డితోనే పార్టీ ఖాళీ అవుతుందా? అంటేకాదు.


కానీ, గంటా వ‌ర్గంగా ఇక్క‌డ ఉన్న చాలా మంది టీడీపీ నాయ‌కులు క్యూ క‌ట్టుకుని మ‌రీ వైఎస్సార్ సీపీలోకి జంప్ చేస్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు టీడీపీకి దూరంగా ఉన్నారు. ఇక‌, గంటా వెంట న‌డిచే ఉద్దేశం ఉన్న నాయ‌కులు కూడా కొంద‌రు పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు పిలుపున‌కు ఏమాత్రం స్పందించ‌డం లేదు. దీంతో గంటా వెంట న‌డిచే వారి సంఖ్య బాగానే ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వీరిలో వంగ‌ల‌పూడి అనిత‌,  గాజువాక మాజీ ఎమ్మెల్యే‌ ప‌ల్లా శ్రీనివాస‌రావు, వాసుప‌ల్లి గ‌ణేష్‌, ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు, అన‌కాప‌ల్లి మాజీ ఎమ్మెల్యే  పీలా గోవింద్‌. య‌ల‌మంచిలి మాజీ ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు  ఉన్నారు.

వీరిలో య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ ప‌ద‌వికి పంచ‌క‌ర్ల ఎప్పుడో రాజీనామా చేశారు. ఇక‌, అర‌కు పాడేరులో ఇప్ప‌టికే ఇంచార్జ్ పీఠాలు ఖాళీగా ఉన్నాయి.  చోడ‌వ‌రంలో నాయ‌కులు ఉన్నా కూడా లేన‌ట్టేన‌ని అంటున్నారు. దీంతో చాలా చోట్ల టీడీపీ ఖాళీ అయిపోతోంది. అంతేకాదు, పెందుర్తిలో బండారు వ‌ర్గం కూడా ఒక‌వేళ‌.. కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, అచ్చెన్నాయుడులు క‌నుక పార్టీ మారితే.. వారి వెంట వెళ్లిపోయే అవ‌కాశం ఎక్కువ‌. దీంతో మొత్తానికి విశాఖ టీడీపీ ఖాళీ అయిపోతోంది. మ‌రి ఇక్క‌డ ఎవ‌రు పార్టీని కాపాడ‌తారు ? ఎవ‌రో ఒక్క‌రైనా లేరా ? అంటే.. చంద్ర‌బాబుకు ఆశాదీపంగా క‌నిపిస్తున్న‌వారు విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు.

ఆయ‌న పార్టీలో ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నారు. అంతేకాదు,  క‌మ్మ వ‌ర్గం కావ‌డంతో చంద్ర‌బాబుకు చాలా క్లోజ్ నాయ‌కుడిగా కూడా మెసులుతున్నారు. బాబు ఇచ్చే ప్ర‌తి పిలుపున‌కు ఆయ‌న స్పందిస్తున్నారు. అనేక ఆందోళ‌న‌లు చేశారు. అంతేకాదు, విశాఖ ప్ర‌జ‌లు రాజ‌ధానిని కోరుకోవ‌డం లేద‌న్న చంద్ర‌బాబు మాట‌ల‌ను ఈయ‌న ఒక్క‌రే స‌పోర్టు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ఆయ‌న మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా చూస్తే.. విశాఖ‌లో టీడీపీకి క‌లిసి వ‌చ్చే నాయ‌కుడు, ఏకైక నాయ‌కుడు వెల‌గ‌పూడి ఒక్క‌రే కావ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news