పార్టీ మారినా.. క‌ర‌ణం వారికి కుల‌పిచ్చేనా..?

-

ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి మ‌రోసారి.. వివాద‌మ‌య్యారు. నిజానికి ఆయ‌న ఎక్క‌డ ఉన్నా.. ఏ నియోజ‌క‌వర్గంలో ఉన్నా.. ఏ పార్టీలో ఉన్నా ఆయ‌న వివాదానికి కేంద్రంగానే ఉంటున్నారు. గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఐకాన్‌గా మారి.. త‌న పేరును ప్ర‌చారం చేసుకునేవారు. క‌మ్మ‌వారిని త‌న వెంట తిప్పుకొనేవార‌న్న ప్ర‌చారం ఉంది. జిల్లా రాజ‌కీయాల్లో క‌మ్మ వ‌ర్గంలో ఎంతో మంది సీనియ‌ర్ నేత‌లు ఉన్నా త‌నే క‌మ్మ‌ల‌కు ప్ర‌తినిధిగా ప్ర‌చారం గుప్పించేవారు. అంటే… టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి.. తాను కూడా క‌మ్మే కాబ‌ట్టి.. ఇలాంటి రాజ‌కీయాలు చేశారు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నుంచి గెలిచినా.. త‌న కుమారుడు వెంక‌టేష్ కోసం.. వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు క‌ర‌ణం. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కాబ‌ట్టి ఇప్పుడు మ‌రోసారి కులం కార్డును వాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఊరు పేరు కూడా తెలియ‌ని రెడ్డి వ‌ర్గాన్ని తెర‌మీదికి తెచ్చి.. మంత్రి బాలినేని ఫొటోతో చేర్చి.. వైవీ సుబ్బారెడ్డి ఫొటోను ప‌క్క‌న త‌గిలించి.. ఇప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని దువ్వే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నం వివాదానికి కార‌ణ‌మవుతోంది.

ఎందుకంటే.. స్థానిక ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాబ‌ట్టి.. ప్రొటోకాల్ ప్ర‌కారం .. ఎంపీ నందిగం సురేష్ ప్ర‌స్థావ‌న తీసుకురావాలి. ఎవ‌రో ఏర్పాటు చేసి ఉంటే.. వేరే సంగతి. కానీ, ఎమ్మెల్యేగా క‌ర‌ణం.. ఆయ‌న కుమారుడు వెంక‌టేష్‌ల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలో.. క‌నీసం సురేష్ ప్ర‌స్థావ‌న కూడా లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం. అంటే.. ఎక్క‌డ ఉంటే.. ఆగూటి పాట అన్న‌ట్టుగా క‌ర‌ణం బ‌ల‌రాం.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి భ‌జ‌న చేస్తూ వారి ప్రాపకం కోసం ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు మ‌రోసారి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నాడు క‌మ్మ వ‌ర్గానికి జిల్లా రాజ‌కీయాల్లో తాను ఐకాన్ అన్న‌ట్టుగా ఎదిగిన క‌ర‌ణం ఇప్పుడు ఏపీలో రెడ్డి వ‌ర్గం నేత సీఎంగా ఉండ‌డంతో ఆ వ‌ర్గం నేత‌ల ప్రాప‌కం కోసం మిగిలిన వ‌ర్గాల‌ను వేరు చేస్తూ వేసిన ఫ్లెక్సీలు మ‌రోసారి వివాదానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇలాంటి రాజ‌కీయం గ‌తంలో చేసిన క‌ర‌ణం.. క‌మ్మ వ‌ర్గంలోనే వివాదానికి కార‌ణ‌మ‌య్యారు. ఇక‌, ఇప్పుడు రెడ్డి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొంటున్న మిగిలిన కులాల‌ను వేరు చేస్తోన్న‌ ఆయ‌న వైనంపై స్థానికంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పార్టీ మారినా.. క‌ర‌ణం.. మ‌న‌స్త‌త్వం మార‌లేద‌ని అంటున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల వైసీపీ మిగిలిన కులాల‌కు దూర‌మా ? అన్న అపోహ‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news