ఆంధ్రప్రదేశ్ హస్తకళా సాంప్రదాయాలను కాపాడుకోవడానికి సమగ్రమైన ప్రణాళిక చేస్తున్నట్లు పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బిలి బొమ్మలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన హస్తకళల ప్రాముఖ్యత, కళాకారులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఆ కళలను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ ముఖ్యమైన సూచనలు చేశారు. అధిక దోపిడీ మరియు నిర్వహణ లోపం వల్ల కళాకారులు సాంప్రదాయకంగా ఉపయోగించే వనరులైన అంకుడు మరియు తెల్ల పొలికి (గివోటియా మొలుక్కనా) కలప వాటి సహజ ఆవాసాలలో బాగా తగ్గుముఖం పట్టాయని ఉపముఖ్యమంత్రి గుర్తించారు.
ఈ కొరత చాలా మంది కళాకారుల జీవనోపాధికి ముప్పు తెచ్చిపెట్టిందని, దానివల్ల ఈ కళారూపాల నిరంతర ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడిందని ఆయన గమనించారు. ఈ వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉప ముఖ్యమంత్రి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) సహకారంతో, రాష్ట్రవ్యాప్తంగా అడవులు మరియు ప్రభుత్వ నర్సరీలలో అంకుడు, తెల్ల పొలికి మరియు స్థానికంగా ముఖ్యమైన ఇతర జాతులను తిరిగి ప్రవేశపెట్టడానికి విస్తృతమైన ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హస్తకళలను కాపాడుకునే ప్రయత్నంలో స్థానిక కమ్యూనిటీలు, కళాకారులు మరియు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను సాంప్రదాయ కళారూపాల రక్షణకు ఒక నమూనా రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.