జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన ముగిసింది. రెండ్రోజులుగా దిల్లీలో ఉన్న పవన్ ఆయన బృందం.. బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి పవన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి మురళీధరన్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్తో సమావేశమయ్యారు. అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్కు బయల్దేరారు.
బీజేపీ అగ్ర నాయకులతో ఏపీ రాజకీయా పరిణామాలు, ఇరు పార్టీలకు సంబంధించిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే దిశగానే గత రెండ్రోజులుగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన, అవినీతి, ఘర్షణలపై బీజేపీ అగ్రనాయకత్వానికి వివరించినట్లు తెలిసింది. ఇక కాషాయ నేతలతో రెండ్రోజుల సంప్రదింపులు సంతృప్తిని ఇచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ పార్టీతో తదుపరి కార్యాచరణపై ఎంత వరకు స్పష్టత వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసే విషయం ఇప్పుడే ఏం చెప్పలేమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.