ప‌వ‌న్ మౌనం ఏంటి… పోటీ చేయ‌కుండా సీట్ల‌న్ని బీజేపీకి ఇచ్చేస్తారా..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల గురించి చ‌ర్చించాల్సి వ‌స్తే.. ఉత్త‌రాంధ్రతో ఆయ‌నకున్న అనుబంధాన్ని ప్ర‌త్యేకంగా చెప్పుకొని తీరాలి. రాజ‌కీయాల్లోకి రాగానే ఆయ‌న‌కు హ‌ఠాత్తుగా ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నం గుర్తుకు వ‌చ్చింది. అదేస‌మ‌యంలో ఆయ‌న‌కు ఇక్క‌డి కిడ్నీ వ్యాధి గ్ర‌స్థులు కూడా క‌నిపించారు. దీంతో ప‌వ‌న్‌కు ఉత్త‌రాంధ్ర‌పై చాలా ప్రేమ ఉంద‌ని అర్ధ‌మైంది. ఇక్క‌డితో ప‌వ‌న్ స‌ర్దుకు పోలేదు. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటు త‌నంపై ఆయ‌న పోరాటం చేస్తాన‌ని చెప్పారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ఉత్తరాంధ్రలో ప‌ర్య‌టించారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించారు. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుపై ఉన్న చ‌రిత్ర‌ను తొవ్వి పోశారు.


దీంతో అక్క‌డి వారందరూ కూడా ఇంకేముంది.. ఉత్త‌రాంధ్ర‌కు ఒక నాయ‌కుడు ల‌భించాడ‌ని అనుకున్నారు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ దెబ్బ‌తో త‌మ ఓటు బ్యాంకు ఎక్క‌డ గ‌ల్లంత‌వుతుందోన‌న్న దెబ్బ‌తో శ్రీకాకుళాన్ని తిత‌లీ తుఫాన్ ముంచెత్తిన‌ప్పుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నేరుగా శ్రీకాకుళంలోనే మ‌కాం వేసి.. అక్క‌డే ఉన్నారు. తుఫాను సాయం అందించారు. మ‌రి ఇలాంటి ఉత్త‌రాంధ్ర ప్రేమికుడైన ప‌వ‌న్ ఇప్పుడు మౌనం ఎందుకు పాటిస్తున్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ మంచి చేస్తానంటే.. ఎందుకు చేయ‌మ‌ని ప్రోత్స‌హించ‌డం లేదు. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేస్తానంటే.. ఎందుకు వ‌ద్దంటున్నారు? అనేది ప‌వ‌న్‌కు చుట్టుముడుతున్న ప్ర‌శ్న‌లు.

పైగా అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని కూడా ప‌వ‌న్ డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఎందుకు ఆయ‌న ఇలా ఉత్త‌రాంధ్ర‌పై శీత‌క‌న్ను వేశారు? అనేది ప్ర‌శ్న‌. దీనివెనుక గ‌త ఏడాది ఎన్నిక‌ల ప్ర‌భావం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌లో ఉత్త‌రాంధ్ర‌లో గాజువాక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేశారు. అదేవిధంగా విశాఖ ఎంపీగా మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇంకా చాలా మంది నేత‌ల‌నే ఉత్త‌రాంధ్ర‌లో పోటీకి పెట్టారు. వీరిలో క‌నీసం స‌గంమందైనా గెలుస్తార‌ని అనుకున్నారు.

కానీ, అక్క‌డి ప్ర‌జానాడి ఓట్ల రూపంలో  తెలిసే స‌రికి ప‌వ‌న్ ఒక్క‌సారిగా మ‌న‌సు మార్చుకున్నార‌ని అంటున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఉత్త‌రాంధ్ర మొహం కూడా ప‌వ‌న్ చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు కోస్తా అయితేనే బెట‌ర్ అనుకుంటున్నార‌ని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కోస్తాలో త‌న‌కు సీట్లు ఎక్కువ తీసుకుని ఉత్త‌రాంధ్ర‌ను బీజేపీకి గుండుగుత్తుగా ఇచ్చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.