తాను ఏపీకి చెందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడిని.. ఏపీ ప్రజల అభిష్టంమేరకు నడుచుకోవాల్సిన నాయకుడిని.. ఏపీ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉన్న నటుడిని అన్న విషయాలు గుర్తుంచుకోవడంలో పవన్ విఫలమవుతున్నారనే కామెంట్లకు గతకొన్ని రోజులుగా బలం చేకూరుతుంది! బీజేపీతో జతకట్టడంవల్ల జాతీయ స్థాయిలో ఆలోచించాలనుకోవడం కరక్టేనేమో కానీ.. అంతకంటే ముందు పునాదులు ముఖ్యమని మరిచిపోకూడదు అనే సూచనలు పెరిగిపోతున్నాయి. అందుకు కారణమైన అంశం… ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం… ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని! ఈ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నూతన విద్యా విధానం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలవుతుందా… లేక ప్రైవేటు పాఠశాలల్లో కూడా అమలవుతుందా? ఈ విషయాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు! ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఈ నిభంధన వర్తిస్తుంది అని అంటే మాత్రం… “పేద పిల్లల బ్రతుకులతో, భవిష్యత్తులతో కేంద్రంలోని పెద్దలు ఆడుకున్నట్లే.. వారి ఎదుగుదలను అడ్డుకున్నట్లే”నన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ విషయలపై తాజాగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్!
ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నూతన విద్యా విధానంలో నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మాతృభాషలో బోధన జరిగినప్పుడే “గొప్ప ఫలితాలు” ఆవిష్కృతమవుతాయని “యునెస్కో” పేర్కొందని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన కోరకున్నదీ, నూతన విద్యా విధాన కమిటీ ఆలోచనా ఒకేలా ఉండడం ఆనందం కలిగించిందని చెప్పిన ఆయన… రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మా పార్టీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు! సరైగ్గా ఇక్కడే పవన్ పై విమర్శలు కౌటర్లు పెరిగిపోతున్నాయి!
నిజంగా మాతృబాషలోనే విద్యాబోధన జరిగితేనే.. గొప్ప గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని పవన్ భావించి ఉంటే… వారి మాతృబాష అయిన తెలుగులోనే పవన్ తన పిల్లలను చదివించి ఉండాల్సిందని అంటున్నారు ఏపీ వాసులు. అలా చదివించకపోవడంవల్ల… పవన్ పిల్లలు “గొప్ప గొప్ప ఫలితాలను” మిస్సయ్యారని… ఆ పాపం పవన్ దే అని అంటున్నారు!
మారుతున్న ప్రపంచీకరణలో భాగంగా తెలుగు బాషను కంపల్సరీ చేస్తూ ఇంగ్లిష్ లో పట్టు సాధించడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు అవకాశాలు మెరుగుపడతాయని జగన్ భావించడం.. దానికి రాష్ట్రవ్యాప్తంగా తల్లి తండ్రులు మద్దతు తెలపడం తెలిసిందే. అన్నీ.. తెలిసి కూడా పవన్ ఇలా కేవలం బీజేపీ పెద్దలను తృప్తి పరచడానికే తాను ఉన్నది అన్నట్లుగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి!