జగన్ సర్కార్ ను కూల్చేస్తామని..జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదని… ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదని నిప్పులు చెరిగారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని…ఈ రోజు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని చురకలు అంటించారు.
ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు గారిని అడ్డుకొనేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి? అని నిలదీశారు. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ… విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని..సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని చెప్పారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని..జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారని వివరించారు.