దసరా నుంచి జనసేన… అంతకుమించి!!

ప్రస్తుతం కరోనా భయంతోనో లేక మరేదైనా కారణంతోనే ఏపీతో సంబంధాలు తెంచుకున్నట్లుగా, చంద్రబాబులా… హైదరాబాద్ లోని ఫాం హౌస్ కే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్… దసరా నుంచి ఏపీలో అడుగుపెట్టబోతున్నారంట. అంతేకాదు పార్టీపరంగా 175 నియోజకవర్గాలకూ సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు! అప్పటినుంచి… జనసేన దూకుడు “అంతకుమించి” అన్నట్లుగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు!

Pawan-Kalyan
Pawan-Kalyan

అవును… గత ఐదారునెలలుగా ఫాం హౌస్ లోనే కాలక్షేపం చేస్తున్న జనసేన అధినేత… 175 నియోజకవర్గాలకు సంబందించి ఎవరు సరైన ఇన్ ఛార్జ్.. ఎవరిపై కేసులు లేవు.. ఎవరిపై నియోజకవర్గం మొత్తం మీద మంచి పేరుంది.. వంటి విషయాలపై ఆరాలు తీస్తూ… ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారంట! ఆ లిస్ట్ లో ఉన్న పేర్లను ఫిల్టర్ చేసి, దసరా రోజున ప్రకటిస్తారట. అక్కడి నుంచి ఇంక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా జనసేన కార్యాచరణ ఉండబోతుందని చెబుతున్నారంట!

ఇదే క్రమంలో.. 175 నియోజకవర్గాలకూ ఇన్ ఛార్జ్ లను నియమించి మాట ఇచ్చేస్తే… మరి బీజేపీతో పొత్తు? అసలు ఏపీలో వారెన్ని సీట్లు అడుగుతారో? 50 – 50 అంటారా? లేక 30 – 70.. అదీ గాక 60 – 40? ఇలా ఏదైనా జరగొచ్చు!! పైగా ఇప్పుడు జనసేన బీజేపీకి టీడీపీలాగా సీట్లు ఇచ్చే పరిస్థితిలో లేదు… బీజేపీ ఇచ్చినవి తీసుకుని సరిపెట్టుకునే పరిస్థితిలో ఉంది… పవన్ అక్కడివరకూ తెచ్చుకున్నారు! మరి ఈ క్రమంలో… 175మందీ ఆశలు పెట్టుకుంటే… పవన్ ఎవరికి సై అంటారు.. బీజేపీ తరుపున ఎవరికి నై అంటారు!!

ఆ సంగతులన్నీ ఎన్నికల సమయానికి చూసుకుంటే సరిపోతుంది. ముందైతే గ్రౌండ్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేస్తే సరిపోతుంది! తర్వాత లెక్కలు తర్వాత అనే ఉద్దేశ్యంతో జనసేన అధినేత ముందుకు వెళ్తున్నారా? లేక చివరి నిమిషంలో బీజేపీ పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచించుకోవచ్చులే అని ఫిక్సయ్యారా అనేది తెలియాల్సి ఉంది!! ప్రస్తుతానికైతే… దసరా నుంచి జనసేన… “అంతకుమించి”!

-CH Raja