ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు కురస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు.తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో వర్షప్రభావం మరింత తీవ్రంగా ఉంది.తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విజయవాడలో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా రికార్డు స్థాయిలో 29 సెమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వర్షాల కారణంగా విజయవాడలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లలోకి నడుం లోతు వరకు నీళ్ళు చేరుకున్నాయి. దీంతో ఇళ్ళ నుంచి బయటకు రాలేని దారుణ పరిస్థితి నెలకొంది. వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇళ్లకు తాళాలు వేసి యాజమానులు, వ్యాపారులు నగరాన్ని వీడుతున్నారు.
బెజవాడ ఏపీఐఐసీ కాలనీ, పీ అండ్ టీ కాలనీ, భారతీ నగర కాలనీలు ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళు కూడా బయటకు రాలేక ఇళ్లలోనే ఉండిపోవలసిన దారుణ పరిస్థితులు ఉన్నాయి. సుమారు 30 ఏళ్ల తర్వాత ఇలాంటి దారుణ వర్షపాతాన్ని చూశామని నగరవాసులు చెబుతున్నారు.