విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా అంశం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం టీడీపీలో ఉండాలా ? వద్దా ? అనే అంశంపై రాధా తర్జన భర్జన పడుతున్నారు. అయితే, ఆయన ఇప్పటికీ ఈ విషయంలో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటికే రాధా కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ అన్ని పార్టీలు మారిపోయారు. ఇప్పుడు మిగిలిందల్లా జనసేన, బీజేపీ మాత్రమే. ఆ మధ్య జనసేన మీటింగ్‌కు వెళ్లి అందరికి షాక్ ఇచ్చారు. ఇదిలావుంటే, తనకు అవసరమైన పనులు చేసిపెడతారని భావించిన తనతండ్రి రంగా శిష్యుడు ఒకరు నిన్న మొన్నటి వరకు రాధాను సమర్ధించిన నాయకుడు కూడా ఆయనను ఇప్పుడు దూరం పెట్టారు.
గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు కూడా రాధాను అన్ని విధాలా పార్టీలకు అతీతంగా సమర్ధించిన ఈ నాయకుడు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులతోపాటు ఓ మృతి కేసులో రాధా కుటుంబానికి సాయం చేసేందుకు విముఖత వ్యక్తం చేశారని తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్న మల్లాది విష్ణు గతంలో రంగాకు ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉన్నారు. రాజకీయంగా రంగా శిష్యుడినని ఆయన అనేక సందర్భాల్లోనూ చెప్పుకొన్నారు.
రంగా జయంతి, వర్థంతులను కూడా విష్ణు ఘనంగా నిర్వహించేవారు. అయితే, గత ఏడాది ఇద్దరూ వైసీపీలో సెంట్రల్ నియోజకవర్గం టికెట్ కోసం పట్టుబట్టిన తర్వాత రాధా బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా రాధా.. విష్ణుల మధ్య సబంధం బాగానే ఉన్నా.. పార్టీలో మారుతున్న ప్రాదాన్యాలను బట్టి విష్ణు ఇప్పుడు ఫుల్‌గా సైలెంట్ అయ్యారనే వాదన వినిపిస్తోంది.
ఇటీవల రాధా ఫోన్ చేసినా.. విష్ణు స్పందించలేదని.. ప్రస్తుతం రాజకీయంగా ఏకాకిగా ఉన్న రాధాను పట్టించుకుంటే.. తన పీఠానికే ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి రాధా చేసిన తప్పులు.. ఆయనను ఇప్పటికీ శాపంగా వెంటాడుతూనే ఉన్నాయి. అదే రాధా ఇన్ని పార్టీలు మారకుండా తండ్రిలా ప్రజల్లో ఉండి ఉంటే ఆయనకు ఇంత రాజకీయ పతనం అయితే వచ్చేది కాదనే చెప్పాలి.
-vuyyuru subhash