విశాఖపట్టణంలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశల వారిగా చేపడుతామని.. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేసినట్టు వైఎస్సార్ సీపీ నేత వై.వీ. సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కారక్రమం చేపట్టే యోచనలో ఉన్నట్టు తెలిపారు. విశాఖ వందనం పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్ నాథ్ తో కలిసి వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు.
అన్ని సమకూర్చుకున్న తరువాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారు అయిందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన చేశారని చెప్పారు. ఈ రాజధానులు ఏర్పడకపోతే మళ్లీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుందన్నారు. సీఎం జగన్ విశాఖకు వస్తే ఇక్కడ అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయన్న ఆలోచనను పూర్తిగా తుడిచివేసే విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు.ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకే ఈ మూడు రాజధానుల ఏర్పాటు అని సుబ్బారెడ్డి తెలిపారు.