రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అప్రతిహత విజయం సాధించడం ఖాయం అని, ఆత్మసాక్షి సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయని, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలన్నది ప్రజాభిప్రాయం అని, ప్రతిపక్షాల ఓటు చీలకూడదన్నది నాయకుల అభిప్రాయం కావడంతో, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలు మూడే ఉన్నాయని, మిగిలిన పార్టీల ఓటు బ్యాంకు కేవలం ఒక్క శాతమే మాత్రమేనని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో కలిస్తే రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తిరుగు ఉండదని ఆయన అన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆత్మసాక్షి సర్వే ప్రకారం 63 స్థానాలలో తమ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పినప్పటికీ, ఆ సంఖ్య 36 లేదా అంతకంటే తక్కువగానే ఉండవచ్చునని అన్నారు.
ప్రస్తుతం ఆత్మసాక్షి సర్వే సంస్థ, ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేసిందని, అందులో టీడీపీ 78 స్థానాలలో, జనసేన ఏడు స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్న ఆత్మసాక్షి సంస్థ, 27 స్థానాలలో హోరా హోరిగా పోరు జరిగే 14 స్థానాలలో తమ పార్టీ మిగిలిన 13 స్థానాలలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించిందని అన్నారు. గత ఎన్నికల తర్వాత జనసేన బలం క్రమేపి పుంజుకుందని, జనసేన బలపడడం, తమ పార్టీ ఓటు శాతం తగ్గడం పరిశీలిస్తే… రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఎలాగైతే విజయం సాధించిందో, అంతటి విజయాన్ని టీడీపీ, జనసేన కూటమి దక్కించుకుంటుందనడంలో ఆత్మ సాక్షి సర్వే సంస్థ ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టం అవుతుందని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు.