విద్యుత్ వినియోగదారులపై పెనుభారం మోపనున్న విద్యుత్ మీటర్ల టెండర్ ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తక్షణమే రద్దు చేయాలని, ఈ కాంట్రాక్టు ద్వారా ఏడేళ్ల పాటు నెలకింతని 26 వేల కోట్ల రూపాయల నిర్వహణ భారాన్ని వసూలు చేయనున్నారని, కేంద్ర ప్రభుత్వం సూచించిన దాని కంటే 240% అధిక మొత్తానికి ఒక కంపెనీకి ఈ కాంట్రాక్టును కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం మీటరుకు ఆరు వేల రూపాయలు మాత్రమేనని సూచించిందని, ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా సరఫరా చేయని సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని, ఇదే విషయం మీద రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం విచారణ జరిపిస్తే జగన్ మోహన్ రెడ్డి గారు జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నూతన విద్యుత్ మీటర్లను బిగిస్తే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తామని చెప్పిందని, అయితే మీటర్లను కచ్చితంగా బిగించాల్సిందేనని మాత్రం చెప్పలేదని, కాబట్టి విద్యుత్ వినియోగదారులపై పెను భారాన్ని మోపనున్న నూతన మీటర్లను బిగించడం అవసరమా?, అనవసరమా?? అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని అన్నారు. కేంద్రం సబ్సిడీ ఇచ్చినప్పటికీ విద్యుత్ వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఏడేళ్ల పాటు డబ్బులు చెల్లిస్తూనే ఉండాలని, వెయ్యి రూపాయలకు ఓటును అమ్ముకునే సామాన్యులకు 100 రూపాయలు కూడా ముఖ్యమేనని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలని అన్నారు.