ఉన్నది ఒక్కడే అయినా కూడా అధినేతను ఒక ఆటాడుకుంటున్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేనాని సంగతి కాసేపు పక్కనపెడితే… జన సైనికులకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన కార్యకర్తలంతా రాపాక పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో జనసైనికులు, రాపాకపై చేసిన కొన్ని విమర్శలు.. అటుతిరిగి ఇటుతిరిగి పవన్ నే తగులుతున్నాయి!
ప్రస్తుతం రాపాక వరప్రసాద్ దృష్టిలో జనసేన అనేది ఒక “గాలి పార్టీ”. ఆ విధంగా ప్రస్తుతం రాపాక.. రాజోలు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కడుపుమండిన జనసేన కార్యకర్తలు విమర్శలమీద విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో… “అధికారం కోసం పాకులాడే వారికి తమ పార్టీలో స్థానం లేదు” అని అంటున్నారు జనసైనికులు. సరిగ్గా ఇక్కదే రాపాక అభిమానులు రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు!
అధికారకోసం కాకపోతే.. నిన్న టీడీపీతో, నేడు బీజేపీతో జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుందని ప్రశిస్తున్నారు. పవన్ కి ఉన్నంత అధికార యావ రాపాకకు లేదనేది వారి వాదన. సీనియారిటీ మాటున నాడు చంద్రబాబు పంచన చేరారు… ఇప్పుడు బాబు పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం.. పవన్ రెండు చోట్ల పోటీచేసినా నోటాతో పోటీపడటంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పంచన చేరారు! ఇవన్నీ గమనిస్తే… అసలు జనసేన అధినేతకే అధికార యావ పీక్స్ లో ఉందని… అలాంటి పార్టీ కార్యకర్తలు “రాపాక”ను విమర్శించడం ఏమిటని అంటున్నారు!!
అధికార యావ పవన్ కి పీక్స్ లో లేకపోతే… ప్రజల కోసం పోరాడకుండా.. అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరడం ఎందుకని రాపాక అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అధికార యావ లేనివారికి అసలు ఎన్నికల్లో పోటీకూడా చేయాల్సిన పనిలేదు కదా… ప్రజల కోసం కేవలం పోరాటాలు చేసుకుంటూపోతే చాలు కదా అనేది వారి మరో ప్రశ్న! దీంతో.. “అధికారం కోసం పాకులాడే వారికి తమ పార్టీలో స్థానం లేదు” లాంటి మాటలు జనసైనికులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని.. అలాకాని పక్షంలో ఇలాంటి విశ్లేషణలు బయటక్కొస్తాయని.. ఫలితంగా బౌన్స్ బ్యాక్ అవుతాయని అంటున్నారు విశ్లేషకులు!!