గుంటూరు జిల్లాలో టీడీపీలో గత పదేళ్లుగా ఓ వెలుగు వెలిగారు ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వియ్యంకులు. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలతో దూకుడుమీదున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఓడిపోయారు. అలాంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు సరికొత్త రాజకీయం చేయబోతున్నారన్న చర్చలు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు తాజా మాజీ అధ్యక్షుడిగా ఉన్న జీవీ. ఆంజనేయులు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుల మార్పుల్లో నరసారావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన తన పార్లమెంటరీ జిల్లాలో దూకుడుగా ఉంటూ పార్టీని పరుగులు పెట్టించడంతో పాటు తన వినుకొండ నియోజకవర్గంలో దూసుకుపోతూ అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు. ఇక ఆయన వియ్యంకుడు అయిన మరో మాజీ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గం అయిన పెదకూరపాడులో స్తబ్దుగా ఉన్నారు. ఆయన చూపంతా ఇప్పుడు గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీదే ఉందట. పెదకూరపాడు కూడా శ్రీథర్ వియ్యంకుడు అధ్యక్షుడిగా ఉన్న నరసారావుపేట పార్లమెంటరీ జిల్లా పరిధిలోనే ఉంటుంది.
ఇద్దరు ఒకే పార్లమెంటు పరిధిలో ఉండడం కంటే చెరో పార్లమెంటు పరిధిలో ఉండడమే బెస్ట్ అన్న నిర్ణయంతోనే శ్రీథర్ గుంటూరు పశ్చిమం వైపు దృష్టి సారించారని అంటున్నారు. అంతే కాకుండా శ్రీథర్ వ్యాపారాలు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అన్ని గుంటూరు పార్లమెంటు పరధిలో ఉండడం కూడా ఇందుకు మరో కారణం అట. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్ రావు వైసీపీ చెంత చేరిపోయారు. ప్రస్తుతానికి అక్కడ చంద్రబాబు కోవెలమూడి రవీంద్రకు పగ్గాలు ఇచ్చినా ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికాదంటున్నారు.
ఈ క్రమంలోనే శ్రీథర్ కన్ను ఇక్కడ పడిదంటున్నారు. ఇక్కడ పార్టీ నేతలు కూడా పార్టీ పగ్గాలను కొమ్మాలపాటికి అప్పగించాలని చంద్రబాబును కోరగా.. ఇదే మంచి అవకాశంగా ఆయన కూడా వేగంగా పావులు కదుపుతున్నారట. ఇక నగరంలోకి కొమ్మాలపాటి ఎంట్రీ ఇస్తే అటు ఆంజనేయులుకు కూడా నగర రాజకీయాల్లో కాస్తో కూస్తో వియ్యంకుడి రూపంలో అండ ఉంటుందని.. అందుకే వియ్యంకులు కొత్త స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.