తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడం పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. తుంగభద్ర నుంచి 90,000 క్యూసెక్కుల నీరు బయటకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కొన్ని జిల్లాలకు వరద ముంపు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల నిర్వహణ లోపం వల్ల ఈ వ్యవహారం జరిగిందని కొన్ని పార్టీలు వ్యాఖ్యలు చేస్తున్నాయి.
తుంగభద్ర ప్రాజెక్టును, ఉమ్మడి రాష్ట్రాలు నిర్వహణ చేస్తాయి. కర్ణాటక, తెలంగాణ, ఏపీతోపాటు, సీడబ్ల్యుసి ఈ డ్యాం పర్యవేక్షణ చేస్తుంది. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఎలా అవుతుంది?ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం దురదృష్టకరం అన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద వేసి తప్పుకోవాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వైఎస్ జగన్ పాలన చేస్తున్నప్పుడు పులిచింతల గేటు కొట్టుకుపోతే 20 రోజుల్లో గేటు పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది అన్నారు.