బియ్యానికి బదులు నగదు స్కీమ్ పై సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. మరో స్కామ్ కోసమే బియ్యం బదులు నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ సోము కామెంట్లు చేశారు. బియ్యం బదులు నగదు ఇస్తాం అనడంలో ప్రభుత్వ కుట్ర కోణం ఉందని… ఇంటింటి రేషన్ పథకాన్ని అటకెక్కించేదుకే ఈ తంతు జరుగుతుందని ఆగ్రహించారు.
పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే కుట్రలో భాగమే బియ్యానికి బదులు నగదు పథకమని.. పశ్చిమగోదావరి జిల్లాలో దొడ్డి దోవన రేషన్ బియ్యాన్ని సన్నాలుగా మారుస్తున్నారు.. వీటి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మండిపడ్డారు.
ప్రజలపై బలవంతంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని..గాజువాక అనకాపల్లి నర్సాపురం కాకినాడ నంద్యాల పట్టణాల్లో సర్వే నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బియ్యమే కావాలన్నారన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కూడా రేషన్ బియ్యం కోరుకుంటున్నారని నిప్పులు చెరిగారు.