చేరికల విషయంలో వీర్రాజు కి ఓ లెక్కుందండోయ్ !

-

అప్పట్లో ఒక వెలుగు వెలుగు ఇప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వారు, అధికార పార్టీ వేధింపులకు భయపడి ఇప్పుడున్న పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్ళాలని చూసేవారికి, ఇప్పుడు ఏపీలో బీజేపీ పెద్దదిక్కుగా కనిపిస్తోంది. తెలుగుదేశం, ఇతర పార్టీల్లోని నాయకులు చాలామంది రాజకీయ ఉనికి కోసం ఆరాట పడుతున్నారు. మరికొందరు వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురవుతున్నారు. వీరంతా చాలాకాలంగా బిజెపిలో చేరాలని చూస్తున్నారు. కేంద్ర అధికార పార్టీ గా బిజెపి ఉండడంతో, ఆ పార్టీలో చేరితే తమకు పదవులు, పలుకుబడి అన్ని వస్తాయి అని, వైసిపి ప్రభుత్వ వేధింపుల నుంచి ఉపశమనం లభిస్తుంది అని చాలామంది నాయకులు బిజెపి వైపు తొంగి చూస్తున్నారు. అయినా బీజేపీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు బిజెపి లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఆ చేరికలు బ్రేకులు వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీని ఒక గాడిలో పెడుతున్నామని, ఇప్పుడు వలస నాయకులను తీసుకురావడం ద్వారా, పార్టీలో అనవసర గందరగోళం తలెత్తుతుందనే అభిప్రాయంలో సోము వీర్రాజు ఉన్నారట. ఇప్పటికే బీజేపీలో చంద్రబాబు వర్గం ఎక్కువగా ఉన్నారని, వారు బిజెపి లో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ఆయనకు చేరవేస్తున్నారు అని వీర్రాజు అభిప్రాయపడుతున్నారు.

అందుకే వలస నాయకుల కంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకులకు పార్టీలో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి, మిగతా నాయకుల ప్రభావం పార్టీలో పెద్దగా లేకుండా చేయాలనే అభిప్రాయంతో వీర్రాజు ఉండటంతోనే, చేరికలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణంగా తెలుస్తోంది. అదీ కాకుండా ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో, ముందు నుంచే పెద్దఎత్తున వలస నాయకులను చేర్చుకుంటే గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని, పదవుల విషయంలో ఒత్తిడి చేస్తారని, ఇలా ఎన్నో అంశాలను ఆయన పరిగణనలోకి తీసుకోవడంతో, ప్రస్తుతానికి వలసలకు బ్రేకులు వేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొత్త కమిటీ లో పూర్తిగా అనుమానాస్పద నేతలను పక్కన పెట్టేసి తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ లో మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారికి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి, తన మాట వినే వారికి మాత్రమే ఆయన ప్రాధాన్యం కల్పించారు. ఇక అన్ని విషయాల్లోనూ ఏ నిర్ణయం అయినా తీసుకునేందుకు పూర్తిగా సోము వీర్రాజు కు అధిష్టానం పెద్దలు స్వాతంత్రం ఇవ్వడంతో, ఆయన తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news