పోలవరంపై సుప్రీం విచారణ.. లాయర్ల సంఖ్యను చూసి షాక్ అయిన ధర్మాసనం

-

పోలవరం కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టులో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలకు పరిహారంగా రూ.120 కోట్ల పరిహారం చెల్లించాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. పోలవరం కేసు వాదనల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించుకున్న సీనియర్‌ అడ్వకేట్ల సంఖ్యను చూసి  ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్క కేసుకు ఇంతమంది సీనియర్‌ అడ్వకేట్లా.. అని ప్రశ్నించింది. ఎక్కువ మంది లాయర్లను నియమించుకుంటే కోర్టు ప్రభావితమవుతుందని అనుకుంటున్నారా.. అని నిలదీసింది.

ఈ కేసులో ఏపీ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మరో కేసులో బిజీగా ఉన్నందున పాస్‌ ఓవర్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకు న్యాయమూర్తులు నిరాకరిస్తూ.. తొలుత ఈ కేసులోని ప్రాథమిక విషయాలేంటో వివరించాలని సూచించారు.

ఎన్జీటీ చేసిన పర్యావరణ పరిహార లెక్కింపుపట్ల తమకు అభ్యంతరం ఉందని న్యాయవాది చెప్పారు. ఏ అంశంపై అభ్యంతరం ఉందో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఆ సమయంలో మరో సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి రాగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన హాజరవుతారని ఏపీ న్యాయవాది విన్నవించారు.

ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఇంతకుముందు సింఘ్వీ అన్నారు.. ఇప్పుడేమో ఈయన అంటున్నారు.. మీరు ఎంతమందిని నియమించుకుంటారు’ అని ప్రశ్నించింది. ప్రభుత్వం లాయర్ల నియామకంపై పెట్టే శ్రద్ధ పర్యావరణంపై పెడుతున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘ఈ కేసు విచారణ కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఆదేశాలు జారీ చేస్తాం’ అని వ్యాఖ్యానించింది. ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్న పోలవరం, చింతలపూడి, పురుషోత్తపట్నం, పట్టిసీమ కేసులన్నీ కలిపి ఒకేసారి వింటామని చెప్పిన ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news