ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. అక్రమ తవ్వకాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి.. మరిన్ని వివరాలు కోర్టు ముందుంచేందుకు కొంత సమయం కోరింది. గతంలో అధికారులు దాఖలు చేసిన నివేదికలపై అనుమానాలున్నాయని.. వాస్తవాలు దాఖలు చేయలేదంటూ మీడియాలోనూ కథనాలు వచ్చాయని గుర్తు చేసింది. నివేదికలన్నీ పునఃపరిశీలించి ఆధారాలతో వివరాలు సేకరించి.. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పారు.
మరోవైపు పూర్తిస్థాయి నివేదిక సమర్పణకు తమకూ సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. 6 వారాల సమయం కావాలని తెలిపింది. ఇప్పటికే తాము 7 జిల్లాల్లో తనిఖీలు జరిపి నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కోర్టు ముందుంచినట్లు చెప్పింది. మిగిలిన జిల్లాల్లోనూ తనిఖీలు జరిపేందుకు 6 వారాల సమయం కావాలని విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న జస్టిస్ అభయ్ ఎస్ వోకా ధర్మాసనం విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.