నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో ఓలీకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం చేయడానికి కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. మరోవైపు కేపీ ఓలీకి కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. రెండు దేశాలు కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపింది.
ఇక తీవ్రమైన రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్లో కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన ఓలీని దేశ అధ్యక్షుడు రాంచంద్ర పాడెల్ ప్రధానిగా నియమించారు. గత శుక్రవారం మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో ఓటమి పాలు కావడంతో నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతిచ్చింది. ఫలితంగా ఓలీ నాలుగోసారి ప్రధాని పీఠం ఎక్కేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన నేపాల్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.