గుడివాడ టీడీపీ నేత ఇంటి మీద దాడి.. మంత్రి కొడాలి పేరుతో ?

కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఇంటిపై దుండగుల దాడి చేశారు. నిన్న రాత్రి 20 మంది దుండగులు ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించి, మంత్రి కొడాలి నాని పై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావా అంటూ, గందరగోళం సృష్టిస్తూ బూతులు తిట్టినట్టు తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. ఇరుగుపొరుగు వారు ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరిస్తుండగా వారి ఫోన్ లని సైతం దుండగులు లాక్కున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈలోపు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుండగులు ఘటనా స్థలం నుండి పరారైనట్టు చెబుతున్నారు. దీంతో ఈ రోజు ఉదయం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో పోలీసులకు తెలుగుదేశం శ్రేణులు ఫిర్యాదు చేయనున్నట్టు చెబుతున్నారు. అయితే నిన్న రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నానిని విమర్శించారు. ఈ నేపధ్యంలోనే ఈ దాడి జరిగిందని తెలుగు దేశం శ్రేణులు చెబుతున్నాయి.