రాజధానుల ఏర్పాటుపై చట్టం చేసే అధికారం లేదు: న్యాయవాదులు

-

అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ ప్రాంతంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని న్యాయవాదులు హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసి తమ వాదనలు వినిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మసనం రాజధానితో ముడిపడిన వ్యాజ్యాలపై తుది విచారణ జరుపుతోంది.

ap high court
ap high court

రాజధానులపై ముడిపడిన వ్యాజ్యాలపై గురువారం న్యాయవాదులు డీస్ఎన్ వీ ప్రసాదబాబు, నర్రా శ్రీనివాసరావు, పీఎన్ఆర్వీ ప్రసాద్ తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. మిగిలిన వ్యాజ్యాలు వినిపించేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా పడింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటుపై న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.

‘శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు. ఈ మూడు వేర్వేరు చోట్లకు మారిస్తే రాష్ట్ర పాలన కష్టతరమవుతుందని, ఏపీ పునర్విభజన చట్టం, సీఆర్ డీఏ చట్టాలకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు విరుద్ధంగా ఉన్నాయి.’’ అని న్యాయవాదులు పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా మార్చేందుకు భూములిచ్చిన రైతులతో సంప్రదించకుండా రాజధానులను తరలిస్తూ.. వారి హక్కులను ఉల్లంఘిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చన్నారు.

అత్యున్నత న్యాయస్థానానికి, రాష్ట్ర హైకోర్టును సంప్రదించకుండానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయం ఏకపక్షమన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ.. చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు హైదరాబాద్ రాజధాని అని విభజన చట్టం ద్వారా నిర్ణయించినప్పుడు.. ఏపీ విషయంలో తమ పాత్ర లేదని ఎలా వెల్లడించిందని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో ద్విసభ విధానం అమలులో ఉంది. అందువల్ల ఏపీ శాసనమండలిలో బిల్లులు పాస్ కాకుండా ప్రభుత్వం అమలు చేసే చట్టాలు చెల్లుబాటు కావు. మూడు రాజధానుల బిల్లును శాసన మండలి ఇంకా ఆమోదించలేదు. ప్రస్తుతం రెండు బిల్లుల్ని మాత్రమే సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. అయితే శాసన మండలి చైర్మన్ ఆమోదం లేకుండానే రాష్ట్ర గవర్నర్ బిల్లును ఆమోదించడం చట్టవిరుద్ధం.’’ అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news