ఏపీ మంత్రి బొత్స‌కు ఎంత క‌ష్టం… ఎంత న‌ష్టం…!

-

రాజ‌కీయంగా సీనియ‌ర్ నేత‌, కేవ‌లం ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సార‌ధిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైఎస్సార్ సీపీ నాయ‌కుడిగా, జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్నారు. అంతేనా? అంటే.. కాదు.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం స‌హా విజ‌య‌న‌గ‌రం జిల్లాపై కూడాత‌న‌దైన మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. జిల్లా మొత్తాన్ని త‌న బంధువులు, స్నేహితుల‌తో నింపేశార‌నే వాద‌న కూడా ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా రాజ‌కీయాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో శాసిస్తున్నార‌నే చెప్పాలి.

అయితే, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటుతో బొత్స‌కు రాజ‌కీయ గండం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు‌న్నాయి. ఆయ‌న ప‌ట్టు పెంచుకున్న విజ‌య‌న‌గ‌రంలో కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు విడిపోనున్నాయి. ఇవి.. ప‌క్క‌నే ఉన్న శ్రీకాకుళం పార్ల‌మెంటు ప‌రిధిలోకి చేరిపోనున్నాయి. అదేస‌మ‌యంలో శ్రీకాకుళం నుంచి వ‌చ్చి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కొత్త‌గా ఏర్ప‌డే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చేర‌నున్నాయి. జిల్లాలోని శృంగవరపుకోట సెగ్మెంట్‌ విశాఖలో కలుస్తుంది. పార్వతీపురం, కురుపాం, సాలూరు స్థానాలు అరకు జిల్లాలో భాగమవుతాయి.

ఇక‌, కీల‌క‌మైన విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరంతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్లతో కొత్త విజయనగరం జిల్లా ఏర్పడుతుంది. అయితే, కొత్త‌గా వ‌చ్చి క‌లిసే రాజాం, ఎచ్చెర్లపై బొత్స పట్టుపెంచుకోవాల్సి వస్తుంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి ప‌ట్టు ఎక్కువ‌గా ఉంది. గ‌తంలోను ఇప్పుడు కూడా ఇక్క‌డ టీడీపీ కీల‌క నాయ‌కులు ఉన్నారు.

పైగా రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడుగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు.. ఇప్పుడు విజ‌య‌న‌గ‌రంపై ఫోక‌స్ పెంచే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో బొత్స దూకుడుకు బ్రేకులు ప‌డ‌తాయా? లేక క‌ళా సైలెంట్ అవుతారా? అనేది చూడాలి. మొత్తంగా బొత్సకు మాత్రం ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పైచేయి సాధించ‌డం అంత తేలిక‌కాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news