లాక్ డౌన్ అన్‌లాక్ 3.0 దశలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై, ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూన్ 16, 17 తేదీల్లో సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ మళ్ళీ ఈ రోజు సమావేశం నిర్వహిస్తున్నారు. అన్‌లాక్ ను ప్రారంభించినప్పటి నుంచి దేశంలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో, తదుపరి ఏఏ రంగాలకు ఉపశమనం ఇవ్వాలన్న విషయమై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా జూలై 31తో అన్‌లాక్ 2.0 ముగియనుండగా.. ఆగస్టు ఒకటి నుంచి అన్‌లాక్ 3.0 ప్రారంభం కానుంది. దీంతో 3.0లో మరిన్ని ఆంక్షలకు సడలింపులు ఇచ్చేందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో కేంద్ర హోం శాఖ నిగ్నమై ఉంది.
ఈసారి సడలింపుల జాబితాలో, సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భౌతికదూరం నిబంధనల మేరకు వీటికి స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. దీనిపై ఐబీ మంత్రిత్వశాఖ హోంశాఖకు విజ్ఞప్తులు పంపింది. కేంద్రం 25 శాతం సీటింగ్‌తో థియేటర్ల నిర్వహణకు ఓకే చెబుతుండగా, యాజమాన్యాలు మాత్రం 50 శాతం సీటింగ్ ఉండాలని కోరుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పాఠశాలలు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పట్లో అందుబాటులోకి రాకపోవచ్చని సమాచారం.