ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భజనపై ఉన్న ఆసక్తి ఆమె నిర్వహించాల్సిన బాధ్యతలపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోని మహిళా కమిషన్ కేవలం.. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇవ్వడంపై ఆసక్తిగా ఉందని ఎద్దేవా చేశారు.
గత మూడేళ్లలో మహిళలపై, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల వివరాలతో స్వయంగా తాము వెళ్లి ఓ పుస్తకం ఇచ్చామని గుర్తు చేశారు అనిత. అందులో 1500 వరకూ ఘటనలు ఉన్నా, వాసిరెడ్డి పద్మ ఆ ఫిర్యాదు ఆధారంగా ఒక్కరికి కూడా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చిన తరువాత పలు ఘటనలు జరిగాయి.. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి హడావుడిగా స్పందించిన వాసిరెడ్డి పద్మ.. గన్నవరంలో యువతిపై గంజాయి బ్యాచ్ సామూహిక అత్యాచార యత్నం ఘటనలో గానీ, జంగాలపల్లె విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.