ఏపీలో జరిగేది కులాల మధ్య పోరు కాదు.. వర్గ పోరు – విజయసాయి రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదు, వర్గ పోరాటమే అని విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదు, ఇది ధనిక, పేద వర్గాల మధ్య పోరాటం అనే వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు చెప్పడం కొందరికి విస్మయం కలిగించింది. చాలా మందికి మింగుడు పడడం లేదు. గడచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని పేదలు, దిగువ మధ్య తరగతి, ఇంకా ప్రభుత్వ సాయం, ఆసరా అవసరమైన అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది జగన్‌ గారి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అని పేర్కొన్నారు.

 

అన్ని ఆర్థిక ఇబ్బందులనూ అధిగమించి, ఎంతో శ్రమకోర్చి సకల జనుల కల్యాణమే పరమార్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఐదున్నర కోట్ల జనసంఖ్య ఉన్న రాష్ట్రంలో ఏ కుటుంబమూ ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యతో బాధపడకుండా చూడడానికి ప్రభుత్వమూ, పాలకపక్షమూ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పి మరీ వేలాది కోట్ల రూపాయలు ఏపీకి మంజూరు చేయించి, బడుగు బలహీనవర్గాల ఆయురారోగ్యాల కోసం ఆ ధనాన్ని రాష్ట్ర సర్కారు ఖర్చుచేస్తోంది. నవ్యాంధ్ర ప్రదేశ్‌ లో ఇంత మంచి శుభకార్యాలు జరగుతుంటే కులాల మధ్య కుమ్ములాటలు ఉన్నట్టు కొందరు చాలా కాలంగా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

 

దాదాపు మూడున్నర సంవత్సరాలు ఓపిక పట్టిన ప్రియతమ ముఖ్యమంత్రి కిందటేడాది డిసెంబర్‌ నెలలోనే ఈ విషయంపై సూటిగా అర్ధమయ్యే మాటలతో స్పష్టత ఇచ్చారు. 2023 డిసెంబర్‌ 16న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ అనే ప్రజా సంపర్క కార్యక్రమం తీరుతెలన్నులను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన మంత్రులు, పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్నది కుల పోరాటం కాదు, వర్గ పోరాటం. ఇది ధనికులు, పేదలకూ మధ్య యుద్ధం. ఈ సందర్భంలో పేదలకు న్యాయం జరిగేలా చూడడం మన బాధ్యత. మనం ఈ పోరాటంలో పేదల పక్షానే నిలబడాలి,’ అని జగన్‌ గారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ధనికులుకు, పేదలకు మధ్య పోరు అంటే ఈ రెండు వర్గాల మధ్య హింసాత్మక భౌతిక పోరాటం కాదు. తమ సంపద మరింత పెంచుకోవడానికి సంపన్నులు అక్రమమార్గంలో పేదలను దోపిడీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, బడుగులు వారిని ప్రతిఘటించడం అని గ్రహించాలి. ఈ ప్రతిఘటనలో పేదల పక్షాన పాలకపక్షమైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాయకులు, కార్యకర్తలు ఉండాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news