తూటాలనైనా తప్పించుకోవచ్చు కానీ, మాటల వంటి తూటాలను మాత్రం తప్పించుకోజాలరు!- అంటారు కొడవటికంటి కుటుంబరావుగారు ఓ వ్యాసంలో! నిజమే.. మాటల తూటాలను మనుషులను కాదు.. మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒక్క మాట కోసం.. కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రత్యర్థుల మాటల తూటాలు మామూలుగా పేలడం లేదు. వరుస సెట్టి మరీ ఏకే 47 నుంచి వచ్చే గుండ్ల మాదిరిగా వర్షం కురుస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా.. అటు కేంద్ర ప్రబుత్వంపైనా కూడా విమర్శల వర్షానికి తక్కువేమీ లేదు.
రాష్ట్ర విషయానికి వస్తే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న విమర్శలు అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు కొందరు నేతలు పనిగట్టుకుని వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిలో గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనిచేసిన నాయకులు కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు.. వైఎస్‌కు ఆత్మీయుడైన ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, హర్షకుమార్ వంటివారు కూడా జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం చూస్తున్నాం. ఇక, వైఎస్సార్ సీపీ జెండా నీడన గెలిచిన నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ నాయకుల్లో రాష్ట్ర చీఫ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గతంలో వైఎస్ జమానాలో పనిచేసిన నాయకుడే. అయినప్పటికీ.. ఆయన కూడా జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఈ గళాల వెనుక ఉన్న స్వరాలు ఎవరివి? అనే సూక్ష్మమైన ఆలోచన తెరమీదికివచ్చింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వ్యతిరేకించడం దగ్గర నుంచి ఓ సామాజిక వర్గం ఉన్నతాధికారి ఊస్టింగ్ వరకు అనేక విషయాలపై జగన్ ప్రభుత్వాన్ని వీరు టార్గెట్ చేస్తున్న తీరు.. ప్రదాన ప్రతిపక్షం టీడీపీ అదినేత చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతున్నదనేది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బాబు మెచ్చుకోళ్లతోనే వీరిరాజకీయాలు ముడిపడి ఉన్నాయా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.