ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సంబంధించిన వార్షిక నివేదిక పార్టీ అధినేత చంద్రబాబుకు అందింది. పార్టీ అధికారం కోల్పోయి ఏడాదిన్నర అయింది. ఈ క్రమంలో ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ? ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో పార్టీ జెండా రెపరెపలాడుతున్నదా ? లేదా ? అనే అంశాలు ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిని బట్టి పార్టీలో ఎవరు యాక్టివ్‌గా ఉంటున్నారు ? ఎవరు దూకుడుగా ఉన్నారు. ఎవరు అసలు పార్టీలోనే ఉన్నప్పటికీ.. పార్టీ పిలుపు ఇస్తున్న మేరకు కార్యక్రమాలు చేయడం లేదు.. అనే విషయాలు కూలంకషంగా సీనియర్లు రిపోర్టులు పంపించారు.
అయితే, ఈ రిపోర్టులకు.. గతంలో అధికారంలో ఉన్నసమయంలో పార్టీ తెప్పించుకున్న రిపోర్టులను జత చేసి చంద్రబాబు విషయాన్ని గుర్తించారు. దీనిని బట్టి.. పార్టీ అధికారంలో ఉన్నసమయంలో చక్రం తిప్పిన ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ మంత్రులు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు పార్టీ తరపున కార్యక్రమాలు చేయడం కానీ, పార్టీ వాయిస్ వినిపించడం కానీ చేయడం లేదని స్పష్టమైంది. అయితే, తాజాగా అందిన నివేదికల్లో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అధికారంలో ఉన్న సమయంలో కంటే.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, పార్టీ నాయకురాలు గౌతు శిరీషలు దూకుడుగా ఉన్నారు. ఇక, సీమలో అనంతపురం మాజీ మేయర్ సహా చాలా మంది నాయకురాళ్లు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు.వివాదాల జోలికి పోకుండా.. పార్టీ అధినేత పిలుపు మేరకు వారు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తలను సమీకరిస్తున్నారు. నిత్యం పార్టీ కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ విషయాలు నివేదికలో స్పష్టంగా తెలియడం గమనార్హం. దీంతో ఇక నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి పార్టీలోనూ పదవులు కేటాయించాలని బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.