తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత విచారణను హైకోర్టు మళ్లీ వాయిదా వేసింది. ఇవాళ జరిగిన విచారణలో భవనాల కూల్చివేత పనులకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా తెలపాలని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కేంద్రం నుంచి స్పందన కూడా అవసరమని భావించిన హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రేపటిలోగా పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించడానికి న్యాయపరమైన అనుమతులు తీసుకోవాలి కానీ, కూల్చివేతకు అక్కర్లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది స్పష్టం చేశారు.
ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెబుతుందో తెలపాలని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. భవనాల కూల్చివేత సమస్య కేంద్రం చేతిలో ఉందని హైకోర్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ప్రకారం భవనాలు కూల్చివేయాలంటే భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది.