వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి ముందుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తున్నారు. కలిసొస్తే బిజేపిని కూడా టిడిపితో కలపడానికి చూస్తున్నారు. ఒకవేళ బిజేపి కలవకపోతే..ఆ పార్టీని వదిలేసి టిడిపితో కలవడానికి పవన్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసిన లేదా..బిజేపితో కలిసి వెళ్ళిన సరే జనసేన ప్రభావం పెద్దగా ఉండదు. ఏదో 10 సీట్లు లోపు మాత్రం గెలిచే ఛాన్స్ ఉంది. ఆ సీట్లు కూడా గెలవడం కష్టమే.
అదే సమయంలో ఓట్లు చీల్చి టిడిపికి నష్టం, వైసీపీకి లాభం జరుగుతుంది. కానీ ఈ సారి వైసీపీని ఓడించాలని పవన్ కూడా చూస్తున్నారు. అలాంటప్పుడు పవన్ టిడిపితో కలవాలి. అందుకే ఇప్పటికే పలుమార్లు చంద్రబాబుతో భేటీ అవుతూ వస్తున్నారు. ఇద్దరు నేతలు పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఇక వీరి పొత్తుని చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. పరోక్షంగా టిడిపి-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టి పొత్తు లేకుండా చేయాలని చూస్తున్నారు. పొత్తు ఉంటే తమకు నష్టమని ఏదొక విధంగా పొత్తుకు చెక్ పెట్టాలని చూస్తుంది.
ఒకవేళ పొత్తు ఉన్నా సరే ఇబ్బంది లేకుండా..తోడేళ్లు గుంపులుగా వస్తున్నాయని, జగన్ సింగిల్ గా సింహంలాగా వస్తున్నారని చెప్పి జనాల్లో సెంటిమెంట్ లేపడానికి చూస్తున్నారు. ఇక ఏ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయినా..టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య సిఎం సీటు అనే చిచ్చు పెడుతున్నారు. పొత్తు ఉంటే పవన్‌కు సిఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణుల ముసుగులో వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
ఒకవేళ పవన్ కు సిఎం సీటు ఇవ్వకుండా పొత్తు పెట్టుకుంటే ఒక్క ఓటు కూడా వేయమని, మళ్ళీ వైసీపీకే ఓట్లు వేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా టిడిపి-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టేలా ముందుకెళుతున్నారు. అయితే టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్..సిఎం పదవి చంద్రబాబుకే అని అందులో ఎలాంటి డౌట్ లేదని టిడిపి శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరి చివరికి పొత్తులో ఏం జరుగుతుందో.