వైఎస్ జగన్ కు భారీస్థాయిలో సీట్లు రావడానికి నవరత్నాలు కీలక భూమిక పోషించాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ ఉండవు! కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగరాదని, నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతూ… జగన్ పాలనసాగిస్తున్నారు. మొదటి ఏడాది పూర్తిగా సంక్షేమానికి మాత్రమే పెద్ద పీట వేసిన ఆయన.. రెండో ఏడాదికి వచ్చేసరికి అభివృద్ధిపై దృష్టి సారించారని వైకాపా నేతలు చెబుతుంటారు! ఆ సంగతులు అలా ఉంటే… జగన్ నవరత్నాల్లో పదో రత్నాన్ని కూడా యడ్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
అవును… తాను నమ్మిన తనను నమ్మిన జనాలకోసం జగన్ నవరత్నాలు అమలుచేస్తూనే… టీడీపీ నేతల అరెస్టుల పర్వాన్ని పదోరత్నంగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు! చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా కొల్లు రవీంద్ర. వీటన్నింటినీ జగన్ పదోరత్నంలో భాగంగా చర్యలు తీసుకుంటున్నారనే కామెంట్లు బలంగా వీస్తున్నాయి.
అవినీతి రహిత పాలనలో భాగంగా అచ్చెన్నాయుడిని, అక్రమ రహిత పాలనలో భాగంగా జేసీని, దుర్మార్గ రహిత పాలనలో భాగంగా చింతమనేనినిని, తాజాగా హత్యారాజకీయ రహిత పాలనలో భాగంగా కొల్లు రవీంద్రని ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే! అంటే… గతంలో అవినీతి, అక్రమ కార్యక్రమాలు చేసిన టీడీపీ నేతలు అంతా ఇకపై వరుసగా జైళ్లకు క్యూలు కట్టే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు! ప్రస్తుతం బాబును అత్యంత దారుణంగా ఇబ్బందిపెడుతున్న సమస్య ఇది!
విచిత్రం ఏమిటంటే… నవరత్నాలపై అడపాదడపా కామెంట్లు చేస్తున్న టీడీపీ నేతలు… పదోరత్నం విషయంలో మొదటిరోజు మాత్రమే హడావిడి చేస్తున్నారు తప్ప.. అనంతరం వాస్తవాలు ప్రజలు గ్రహిస్తున్నారనో ఏమో కానీ… సైలంట్ అయిపోతున్నారు! దీంతో… జగన్ పదో రత్నంలో రాజకీయ కోణంలేదని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగ కాదని… తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదని చెప్పినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే… ఈ సిరీస్ కంటిన్యూగా ఉండే సూచనలు ఉన్నాయని.. నవరత్నాలు ఎంత ముఖ్యమో పదో రత్నం అమలు కూడా అంతే ముఖ్యంగా జగన్ సర్కార్ భావిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి! మరి ఈ తరుణంలో… ఈ పదోరత్నం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి!