వైసీపీలో ఆ ఇద్ద‌రు బూతుల‌తోనే మాంచి జోష్ వ‌స్తోందా…!

కొడాలి నాని, వల్లభనేని వంశీ….ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు టీడీపీతోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి, మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకులు. కాకపోతే కొడాలి మొదట టీడీపీని వీడి వైసీపీలోకి వెళితే, ఇప్పుడు వంశీ టీడీపీని వీడి జగన్‌కు జై కొట్టారు. అయితే ఇద్దరు టీడీపీని వీడేప్పుడు చంద్రబాబుని తెగ తిట్టి వెళ్ళిపోయారు. అలాగే కృష్ణా జిల్లాలో టీడీపీలో పెత్తనం చేస్తున్న దేవినేని ఉమాని బండ బూతులు తిట్టారు.


ఇక కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి బాబు అండ్ బ్యాచ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉంటూ బూతులతో విరుచుకుపడుతున్నారు. అటు వంశీ కూడా వైసీపీ వైపు వచ్చాక, తన మాట తీరు పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. ఆయన కూడా తన నోటికి పదును పడుతూ, టీడీపీపై ఫైర్ అవుతున్నారు. అయితే వైసీపీలో ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నది ఎవరు అంటే, ఈ ఇద్దరు నేతల పేర్లు చెప్పొచ్చని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు.

అయితే కొడాలి, వంశీలు బూతులు మాట్లాడటం వల్ల వైసీపీకి ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందా ? అంటే లేదనే తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిరోజూ జూమ్ యాప్‌లో వచ్చి ఏవేవో విమర్శలు చేసేస్తున్నారు. ఇక ఈ విమర్శలకు కొడాలి, వంశీలకు బాగా మండుతుంది. అందుకే వారు మీడియా ముందుకొచ్చి తమ నోటికి పనిచెబుతున్నారు.

ఇక వీరికి టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గానీ, అవి కొడాలి, వంశీల రేంజ్‌లో ఉండటం లేదు. అలా అని వీరి బూతుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా లేవు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని స్థితికొచ్చేశారు. పైగా కొడాలి, వంశీల బూతులకు వైసీపీ శ్రేణుల్లో మంచి జోష్ వస్తుంది. కాబట్టి వీరి వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు.

-Vuyyuru Subhash