వైసీపీలో మంది ఎక్కువ‌.. మ‌జ్జిగ ప‌ల‌చ‌నేనా…!

-

మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది అన్న సామెత విశాఖ వైసీపీకి నూటికి నూరు శాతం వ‌ర్తిస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చింది. అసలు ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు, నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలో చేర్చుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అయితే ఇప్ప‌టికే టీడీపీకి చెందిన  న‌లుగురు, జ‌న‌సేన‌కు చెందిన ఒక ఎమ్మెల్యే వైసీపీ సానుభూతిప‌రులు అయిపోయారు. ఇక ఎగ్జిగ్యూటివ్ కాపిట‌ల్ అవుతోన్న విశాఖ‌లో గ‌త ఎన్నిక‌ల్లో సిటీలో ఉన్న నాలుగు స్థానాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు.

ఇక్క‌డ పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ టీడీపీ ఎమ్మెల్యేలు, ఆపార్టీ నేత‌ల‌ను ఫ్యాన్ కింద‌కు చేర్చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్‌కుమార్ ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు. ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు సైతం త్వ‌ర‌లోనే ఫ్యాన్ పార్టీ సానుభూతిప‌రుడు అవుతార‌ని టాక్‌. ఇక నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు సైతం రేపో మాపు త‌న అనుచ‌ర‌గ‌ణంతో క‌లిసి సైకిల్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్ప‌టికే వైసీపీలో విశాఖ‌లో ప‌లువురు కీల‌క నేత‌లు ఉన్నారు. ఎంపీ స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్ త‌దిత‌రులు ఉన్నా… వీరిని కాద‌ని జ‌న‌సేన‌, టీడీపీకి చెందిన నేత‌ల‌కు రెడ్ కార్పెట్ వేసి మ‌రీ పార్టీలోకి తీసుకోవ‌డాన్ని వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల దంపతులు, దక్షిణంలో  ద్రోణంరాజు ( ఇటీవ‌ల మృతిచెందారు), కోలా గురువులు, ఉత్తరంలో కె.కె.రాజు, పశ్చిమంలో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఉండ‌గానే వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంతో ఈ నేత‌ల‌కు మంట పుట్టిస్తోంద‌ట‌.

ఇప్పుడు వైసీపీ అధిష్టానం సైతం త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు ఉండ‌డంతో వ‌ల‌స నేత‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ, పార్టీ కోసం ముందు నుంచి ఉన్న నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ చెంత చేరిపోతు నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు అంద‌రూ డ‌మ్మీలు అయిపోతార‌ని వారు ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. ఏదేమైనా విశాఖ వైసీపీలో నేత‌లు ఎక్కువ అవుతోన్న కొద్ది ఆ పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న ఎక్కువ‌గానే ఉంది.

 

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news