వైసీపీలో ఆయ‌న‌దే పెత్త‌నం… ఆ ఎమ్మెల్యేలంతా డ‌మ్మీలే…!

వైఎస్సార్ సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస‌కు బాబాయి అయ్యే టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేరు. కేవ‌లం టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్నారు. అదేస‌మ‌యంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఆయ‌న మాత్రం రెండు జిల్లాల‌ను కేంద్రంగా చేసుకుని ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలు పార్టీని తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వాస్త‌వానికి వైవీ ప్ర‌కాశం జిల్లా ఒంగోలు రాజకీయాల‌ను శాసించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కుముందు వ‌ర‌కు కూడా ఆయ‌న ఒంగోలు ఎంపీగా ఉన్నారు. దీంతో జిల్లాల్లో ఆధిప‌త్య పోరుకు తెర‌దీశారు. ఈ ప‌రిణామాల‌తో విసుగుచెందిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు ఏకంగా టికెట్ కూడా ఇవ్వ‌లేదు.

పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప‌గించారు. అయితే, అదేస‌మ‌యంలో ఇటీవ‌ల ఆయ‌న‌కుప‌శ్చిమ గోదావ‌రిలో పార్టీని చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇది వాస్త‌వం కాద‌ని, కేవ‌లం ప‌ర్య‌వేక్షణ బాధ్య‌త‌లు మాత్ర‌మే అప్ప‌గించార‌ని అంటున్నారు. కానీ, వైవీ మాత్రం పూర్తిగా ప‌శ్చిమ రాజ‌కీయాల‌పైత‌న‌దైన ముద్ర‌వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కొన్నాళ్లుగా జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డి రాజ‌కీయాల‌ను శాసించే రీతిలో మంత్రుల‌తోనూ స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, గుంటూరు జిల్లాపైనా ఆయ‌న దృష్టి పెట్టారు. కీల‌క‌మైన నాగార్జున విశ్వ‌విద్యాల‌యం వీసీ నియామ‌కం ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే సాగింద‌నే ప్ర‌చారం ఉంది.

అదేస‌మ‌యంలో ఈ రెండు జిల్లాల్లోనూ మంత్రుల‌ను త‌నదారిలోకి తెచ్చుకుని త‌న క‌నుస‌న్న‌ల్లోనే వారు ప‌నిచేయాల‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో ఇక్క‌డి నాయ‌కులు బెంబ‌లెత్తుతున్నారు. కొంద‌రికే వైవీ అనుకూలంగా ఉంటున్నార‌ని, ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి లేదా త‌న‌కు అనుకూలంగా ఉండేవారికి మాత్ర‌మే ఆయ‌న ప‌నులు చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు. ఇక‌, ఏం జ‌రిగినా, త‌న‌కు చెప్పే చేయాల‌నే ధోర‌ణిని కూడా వైవీ అనుస‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.