మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల వయసున్న చీతా కూన (ఆడ చిరుత పిల్ల) మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన జ్వాల అనే ఆడ చీతా (జ్వాల)కు ఈ ఏడాది మార్చ్ నెలలో నాలుగు కూనలు పుట్టాయి. అయితే వీటిలో ఒకటి మంగళవారం (మే 23న) మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చీతా కూన మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు.
కునో మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ తీరుపైనా, సమర్థత పైనా అనుమానాలు తలెత్తాయంటున్నారు. ఇక్కడి ఈ జంతువుల కన్సర్వేషన్ ప్రాజెక్టులో లోపాలు ఉండవచ్చునని నిపుణులు తాజాగా భావిస్తున్నారు. కేవలం మూడు నెలల కాలంలో సషా, ఉదయ్, దక్ష అనే ఛీతాలుమరణించాయి. వీటిలో దక్ష అనే చీతా తీవ్ర గాయాలకు గురై మృతి చెందింది. ప్రస్తుతం ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 17 ఛీతాలు, మూడు కూనలు ఉన్నాయని, వీటినైనా జాగ్రత్తగా సంరక్షించుకోవలసి ఉందని సిబ్బంది చెబుతున్నారు.