పేదలకు ఈ రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో గూడు ఏర్పాటు చేయాలనేది వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్ సంకల్పం. గతంలో తాను నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా గూడు లేని పేదలు రాల్చిన కన్నీటి బోట్లు ఆయనను కరిగించాయి. ఈ క్రమంలోనే ఆయన పేదలకు ఇళ్లు ఇస్తానని, తాను అధికారంలోకి రాగానే చేసే రెండో పని ఇదేనని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన ఉగాది పండుగ నాటికి ఖచ్చితంగా ఇళ్లు ఇస్తానని చెప్పారు. దాదాపు దీనికిగాను జగన్ పెట్టుకున్న లక్ష్యం 25 లక్షల ఇళ్లు.
అనుకున్నట్టే పేదలు ఆయనను గెలిపించారు. అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే జగన్ ఈ పథకంపై దృష్టి పెట్టారు. తాను మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఉగాది నాటికి ఇళ్లు ఇస్తామన్నారు. స్థలాలను కూడా సేకరించారు. అయితే, ఈ కార్యక్రమం కనుక అమలైతే.. రాజకీయంగా తమకు పుట్టగతులు ఉండవని భావిస్తున్న టీడీపీ, ఈ పార్టీని బతికించుకోకపోతే.. మాగతేంటని భావిస్తున్న ఎల్లో మీడియాలు సైంధవుల మాదిరిగా.. అడ్డుతగులుతున్నారు. అక్కడ ఇళ్లు ఇస్తారా? ఇక్కడ ఇళ్లు ఇస్తారా? అక్కడ నీల్లు లేవు.. ఇక్కడ.. సౌకర్యాలు లేవు.. అంటూ రాతలు రాయడం, విమర్శలు చేయడంతో నిజానికి ప్రజల్లోనూ భయం పట్టుకుంది.
కానీ, జగన్ ప్రభుత్వం చెప్పింది ఏంటి.. ముందు తొలిదశలో స్థలం ఇస్తా.. తర్వాత వాటిని ఇళ్లుగా కట్టిస్తాం అని. కానీ, ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య దీనిని వెంటాడుతూనే ఉంది. తాజాగా దీనికి పెట్టుకున్న ముహూర్తం.. ఆగస్టు 15. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఇచ్చి. వారికి కూడా సొంత గూడు కలిగించామనే సంతృప్తిని మిగల్చాలని జగన్ భావిస్తున్నారు. అయితే, దీనిని కూడా ముందుకు సాగకుండా చేయాలనే కుట్రలు బయటవకు వచ్చాయి.
కన్వేనియన్స్‌డీడ్‌లతో జగన్ ప్రభుత్వం ఇళ్లు ఇస్తోందని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఓ వర్గం మీడియా ప్రజల్లో అభద్రతా భావం పెంచేందుకు కుట్ర చేసిందనే వాదన వినిపిస్తోంది. మరోపక్క, దీనిపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ పథకం పంపిణీ.. వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.