ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదవ్వగా.. ఆయన అరెస్టు నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్ కుమార్ తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భార్గవ్ ను వెతుక్కుంటూ ఆళ్లగడ్డ ఎస్సై రమేశ్ బృందం హైదరాబాద్ వచ్చారు. కారులో వెళుతున్న భార్గవ్ రామ్ ను చూసిన ఎస్సై రమేశ్ ఆ కారును నిలువరించేందుకు ప్రయత్నించారు. అయితే భార్గవ్ రామ్ తన కారును ఆపినట్టే ఆపి దూకుడుగా ముందుకు ఉరికించడంతో ఎస్సై రమేశ్ బృందం ప్రమాదం నుంచి తప్పించుకుంది.
అనంతరం భార్గవ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో తనపైనే దాడికి యత్నించాడంటూ ఆ ఎస్సై గచ్చిబౌలి పోలీసులకు భార్గవ్ రామ్ పై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న తమకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాడని, కారుతో తమపైకి దూసుకువచ్చేందుకు యత్నించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఎస్సై రమేశ్ ఫిర్యాదుతో అఖిలప్రియ భర్తపై సెక్షన్ 353, 336 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.