బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న ‘అసని’ బలహీనపడుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఈరోజు తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడి ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని వెల్లడించింది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ముప్పు తప్పనుంది.
కాగా ప్రస్తుతం తీవ్ర తుఫాన్ అసని కదలికలను ఉత్తరాంధ్ర యంత్రాంగం నిశితంగా గమనిస్తోంది. ఈ మేరకు ఎల్లో వార్నింగ్ సందేశంతో ప్రజలను అలర్ట్ చేసింది. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైతే సహాయ చర్యలకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఫోన్ నంబర్: 0891- 2950100,0891-2950102. తుఫాన్ బలహీనపడే వరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలు జారీ చేశారు.