వాతలు పెట్టుకుంటున్న ఏపీ నాయకులు ? సంజయ్ ను పోల్చుకుంటూ ..?

-

అకస్మాత్తుగా వచ్చిన ఊపుతో తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బిజెపి అధికారం సాధించే స్థాయికి ఎదగడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. వరుసగా తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలలో బిజెపి బలం పుంజుకున్న తీరు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, బిజెపి బాగా బలం పుంజుకోవడంతో పాటు, అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనే విధంగా బిజెపి బలం సాధించింది. కాంగ్రెస్ బలహీనం కావడంతో బిజెపికి తెలంగాణలో ఆదరణ పెరుగుతూ వస్తోంది. నిత్యం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రజా పోరాటాలను చేపడుతూ, అవినీతి వ్యవహారాలను బహిరంగంగా తప్పుపడుతూ సంజయ్ ఒక వ్యూహం ప్రకారం తెలంగాణలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.

ఇదే ఏపీ నాయకులకు స్ఫూర్తి కలిగిస్తోంది. సంజయ్ మాదిరిగా ఏపీలోనూ బీజేపీని పరుగులు పెట్టించాలని, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలలోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుకోవాలని బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం బండి సంజయ్ రూట్ లో వెళ్లేందుకు డిసైడ్ అయిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఎంఐఎం ప్రభావాన్ని తగ్గించేందుకు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టడం వంటి కారణాలతో బిజెపి గ్రేటర్ లో ఊహించని విధంగా స్థానాలను దక్కించుకుంది. ఇప్పుడు అదే ఫార్ములా ఏపీ నాయకులు ఉపయోగిస్తున్నారు. తాజాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు సైతం సర్జికల్ స్ట్రైక్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు పెద్దగా జనాల్లోకి వెళ్లినట్టు కనిపించలేదు.

సర్జికల్ స్ట్రైక్ పేరుతో హిందువుల‌ను ఏకం చేసి పట్టు సాధించాలన్నాఇక్కడ వర్కవుట్ కానీ పరిస్థితి. దీనికి కారణం తెలంగాణ పోల్చితే ఏపీలో బీజేపీ బలహీనంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ పార్టీని దాటుకుని బిజెపి ఎదగాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. అక్కడ కాంగ్రెస్ బలహీనం కావడంతోనే బీజేపీకి అవకాశం చిక్కింది. అది కాకుండా, విభజన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీ విషయంలో చిన్నచూపు చూసింది అనే భావన ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా తో పాటు, అనేక అంశాలలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు ప్రజలలోనూ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మాదిరిగా ఏపీలో బీజేపీకి సానుకూల అంశాలు పెద్దగా లేవు. పైగా తెలంగాణ లో బిజెపి బాటలో వెళ్లేందుకు అక్కడ  నాయకులు అనుసరించిన వ్యూహాలను ఇక్కడ అనుసరిద్దాం అంటే అది వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news