బీజేపీ పరిస్థితి కేడర్ తక్కువ లీడర్లు ఎక్కువలా మారిందా

-

ఏపీలో బలపడాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీకి ఏదీ కలిసిరావడం లేదు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇలా అనేక అంశాలు ఆ పార్టీ రాష్ట్రంలో బలపడేందుకు అడ్డంకులుగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అన్ని రాష్ట్రాల్లో బలపడుతూ దూసుకెళ్తోంది. అయితే ఏపీలో మాత్రం.. కమలనాధులు బలీయమైన శక్తిగా ఎదగలేకపోతున్నారు. పార్టీకి ఉన్న కేడర్ కంటే పెత్తనం చేసే లీడర్లు ఎక్కువయ్యారు.


ఏపీలో బీజేపీ లీడర్లలో ఒకరంటే ఒకరికి పడదు. మూడు గ్రూపులు.. ఆరు వర్గాలుగా తయారయ్యారు. రోజుకో పంచాయతీతో రోడ్డుక్కుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట పార్టీ పెద్దలు. ఉన్న కొద్ది మంది నేతలైనా ఒక్కతాటిపై ఉన్నారా అంటే అదీ లేదు. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ సమస్యల పై దృష్టిపెట్టకపోవడంతో చాలాచోట్ల వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. అందుకు ఉదాహరణ విజయనగరం జిల్లా బీజేపీ నేతలు.

విజయనగరం బీజేపీలో ఎంతో మంది సీనియర్‌ నేతలు ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజు, మాజీమంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు, మాజీ విప్ గద్దె బాబురావు, బీజేపీ ట్రెజరర్‌గా పని చేసిన పాకలపాటి సన్యాసి రాజు, శివారెడ్డి , విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు రెడ్డి పావనితో పాటు అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. అయితే అందరూ పార్టీలో ఎవరి గ్రూపును వారు నడుపుకుంటూ వస్తున్నారు. ఏ ఇద్దరు నాయకులకు ఒకరంటే ఒకరికి పడటంలేదని సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.

విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుని ఎంపిక సమయం నుండే పార్టీ అధిష్టానం తప్పటడుగులు వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహన్ రావు జిల్లా అధ్యక్షులుగా ఉండేవారు. వయోబారం కారణంగా అధ్యక్ష పదవికి ఆయన న్యాయం చేయలేకపోయారు. అదే సమయంలో రాష్ట్ర ట్రెజరర్‌గా ఉన్న సన్యాసిరాజు.. యాక్టివ్‌గా పార్టీని నడిపించారు. అయితే ఎన్నికల్లో పార్టీ ఫండ్‌ని గోల్‌మాల్‌ చేశారనే ఆరోపణలు రావడంతో పార్టీ ఆయనను పక్కన పెట్టింది.

కొత్తగా పార్టీలో చేరిన రెడ్డిపావనికి పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో మరోసారి బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో సీనియర్లను కాదని.. కొత్తగా పార్టీలో చేరినవారికి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు మిగిలిన నేతలు. మున్సిపల్ ఎన్నికల కోసం సేకరించిన నిధులు అభ్యర్థులకు అందలేదని గొడవ జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేత నిధులను సమకూరిస్తే..పార్టీ బాధ్యతలు మోస్తున్న కొందరు డబ్బులును గోల్ మాల్ చేసారని సొంతపార్టీ వారే ఆరోపించడం కలకలం రేపాయి. ఈ నిధుల గోల్ మాల్ పై పార్టీ ఆఫీస్ లోనే నేతలు బాహాబాహీకి దిగారని కమలం పార్టీ నేతలు.

ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. సన్యాసిరాజుని జిల్లా పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరించారు జిల్లా నేతలు. పార్టీలో వరస వివాదాల తలెత్తుతుండటంతో కార్యకర్తలు తీవ్రనిరాశలో ఉన్నారు. పార్టీపై అభిమానంతో తాము పనిచేస్తుంటే.. జిల్లా నాయకుల గ్రూప్ తగాదాలతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ తలలు పట్టుకుంటున్నారు. నేతలు సొంత ఇమేజ్‌ కోసం పార్టీని డ్యామేజ్‌ చేస్తున్నారని మండిపడుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news