ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 36,047 శాంపిళ్లను పరీక్షించగా మరో 448 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 146 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 8,306 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 10,331 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 4,465మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 129 కి చేరింది.