వేళకు ఆఫీసుకు రండి
ఆఫీసు వేళల్లో ఆఫీసు పనిచేయండి
వేళ తప్పి విధులు నిర్వర్తించడం
మానుకోండి ..
ఈ విధంగా చెప్పామే అనుకోండి ఉద్యోగులకు కోపాలు వస్తాయి. వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే ఉద్యోగి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెల కారణంగా కొత్త సమస్యలు సృష్టిస్తూ వివాదాల్లో తనకు తానుగానే ఇరుక్కుంటున్నాడు.
ఆంధ్రావనిలో కొత్త పీఆర్సీకి సంబంధించి ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అసలు దీనిని రద్దు చేసి పాత విధానంలో ఇస్తున్న జీతాన్నే కొనసాగించాలని కూడా కోరుకుంటున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ఇప్పటికిప్పుడు జీఓ రద్దు సాధ్యం కాకపోయినా ఉద్యోగుల పంతం మాత్రం అస్సలు వీడేలా లేరు. తాము తల్చుకుంటే ప్రభుత్వాలను సైతం కూలగొట్టగలమని గతంలో హెచ్చరికలు కూడా చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు మాత్రం మునుపటి గొంతుకను వినిపించలేకపోతున్నారు.
దీంతో వివాదం రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలకు దిగుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం అయితే తమకు ఒక్కొక్కరికి నాలుగు వేల నుంచి పది వేల రూపాయల వరకూ నష్టం ఉంటుందని లెక్క తేల్చారు ఉద్యోగులు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కేందుకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.
ఇదే సమయంలో ఉద్యోగులు తమ జీతాల కోసం పట్టుబడుతున్న విధంగా విధుల విషయంలో ఎందుకు పారదర్శకంగా ఉండలేకపోతున్నారు అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. జీతాల పెంపుదలకు సంబంధించి ప్రభుత్వంతో ప్రస్తుతం రాజీ పడి సక్రమంగా విధులు నిర్వర్తించాలని కూడా ఇంకొందరు తమ సలహాను అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు అసందర్భంగా రోడ్డెక్కి మాట్లాడే కన్నా కొద్ది రోజులు ఆగి, ప్రభుత్వంతో చర్చలు జరిపితే మేలు అని కూడా ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు జగన్ కూడా సంయమన ధోరణిలోనే ఉన్నారు కనుక కేవలం సంప్రతింపులతోనే పరిష్కారం అయ్యే సమస్యలకు ధర్నాల వరకూ ఎందుకని ఇంకొందరు హితవు చెబుతున్నారు. ఫిట్మెంట్ 30 శాతం ఇవ్వనిదే తాము శాంతించమని చెప్పడం కూడా సమంజసంగా లేదు. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న అల్పాదాయ వర్గాలను చూసి అయినా ఉద్యోగులు నేర్చుకోవాల్సి ఎంతో ఉందని, కానీ విధులు మరిచి కేవలం జీతాలే ప్రధాన సమస్యగా తీసుకుని నిరసనలు చెప్పడం సబబుగా లేదని కూడా ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.