పాపులార్ అవుతా అనుకున్నారో లేక సీఎం దృష్టిలో పడతా అనుకున్నారో ఆ మంత్రిగారు కాస్త స్పీడయ్యారు. సంయమనం పాటించి మాట్లాడాల్సిన విషయాల్లో వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పనిచెప్పేశారు. తన పనితీరుతో ప్రభుత్వాన్ని గట్టెక్కించాల్సిన మంత్రి..తాను ఇరకాటంలో పడటమే కాకుండా స్వపక్షాన్ని కూడా ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పై నడుస్తుంది.
వెలంపల్లి శ్రీనివాస్ ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏ శాఖపైనా రానన్ని విమర్శలు దేవాదాయశాఖపై వస్తున్నాయి. అంతేస్థాయిలో ప్రచారం..చర్చ జరుగుతోంది. ఏపీలోని ఆలయాలపై వరస దాడులు.. ఉద్రిక్త పరిస్థితులకు వెలంపల్లిని కార్నర్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇలాంటి ప్రతికూల సమయంలో ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడాలో సరైన నిర్ణయం తీసుకోలేక సంయమనం కోల్పోతున్నారు. వరస వివాదాలతో ఫస్ట్రేషన్ కి గురవుతున్నారని అధికార పార్టీలోనే వెల్లంపల్లి పై చర్చ జరుగుతోందట.
దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వెలంపల్లి..తన శాఖకు తగ్గట్టుగానే పద్ధతిగా ఉండాలని అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. వరస వివాదాలు ముసురుతున్న సమయంలో ఆయన అవేమీ పట్టించుకోవడం లేదని సమాచారం. దేవాలయాలపై దాడుల అంశంలో ప్రభుత్వం ఇరుకున పడుతోంది. ఈ దాడుల్లో టీడీపీ, బీజేపీ వాళ్ల హస్తం ఉందని స్వయంగా డీజీపీ వెల్లడించారు. ఇంత సున్నితమైన అంశాన్ని వెలంపల్లి సరిగా డీల్ చేయలేకపోతున్నారనే టాక్ సీఎం సన్నిహిత వర్గాల్లో నడుస్తుందట.
సమస్యను సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నామన్న భావనో.. మాటల్లో వాడి పెంచకపోతే పాపులారిటీ రాదన్న లాజిక్కో కానీ ఈ మధ్య నోటికి బాగా పనిచెబుతున్నారు వెలంపల్లి. రామతీర్థం ఘటనలో టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజును పట్టుకుని చెడామడా తిట్టేశారు. దీంతో క్షత్రియ సామాజికవర్గాలకు ఆయన టార్గెట్ అయ్యారు. మంత్రి వెలంపల్లికి వ్యతిరేకంగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేశారు.. మంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అశోక్ గజపతిరాజు విషయంలో లౌక్యంగా వెళ్లకుండా వెలంపల్లి ఎంచుకున్న మార్గంపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అశోక్‌గజపతిరాజు ఎపిసోడ్‌లో వచ్చిన రియాక్షన్ రుచి చూసిన తర్వాత కూడా మంత్రి వెలంపల్లిలో మార్పు రాలేదట. పరిస్థితి సెట్ చేసుకోవాల్సిన ఆయన.. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అండ్ టీమ్‌ను పట్టుకుని చెడామడా తిట్టేశారు. ఈ దఫా ఇంకాస్త డోసు పెంచి మాటలు వదిలేశారు. ఈ అంశంపైనా అధికార పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోందట. అంతేకాదు.. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి మంత్రిగారి నోటి దూల పదవికే ఎసరు పెడుతుందా అన్న చర్చ నడుస్తుంది.