ఏపీలో వరద నష్టాన్ని అంచానా వేసిన ప్రభుత్వం…

ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో కురిసిన వర్షాలకు భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. చిత్తూర్, అనంతపురం, నెల్లూర్, కడప జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేల సంఖ్యలో మూగజీవాలు మరణించాయి. గత కొన్ని ఏళ్లుగా చూడని వర్షపాతం నమోదైందని ప్రజలు అంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లు, విద్యుత్ లైన్లను పునరుద్దరించే పనిలో అధికారులు ఉన్నారు. వరద నష్టంపై సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారీ వరదల్లో నష్టపోయిన ఏపీకి తక్షణ సాయం కింద రూ. 1000 కోట్లు కేటాయించాలని కోరారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వరద నష్టాన్ని అంచానా వేసింది. వరదల వల్ల రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లిందని అంచానా వేసింది. లక్షా 42 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అంచనా. ఇందులో రహదారులు దెబ్బతినడం వల్ల రూ. 1,756 కోట్లు, డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం రూ. 556 కోట్లు, వ్యవసాయ రంగానికి జరిగిన నష్టం రూ. 1,353 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.