విద్యుత్ వివాదం : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ జెన్‌కో

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదం.. రోజు రోజుకు ముదురుతోంది. ఈ నేపథ్యం లోనే తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించింది ఏపీ జెన్‌కో. తమకు రావాల్సిన రూ. 6,283 కోట్ల బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని పిటిషన్‌లో వివరించారు.‘‘ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలే తమకు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. డిస్కంల నుంచి బకాయిలు రావల్సి ఉంటే, వాటి నుంచి వసూలు చేసుకోవాలి కానీ జెన్ కోకు చెల్లించాల్సినవి నిలిపివేయడం సరికాదు. ఈ వివాదంపై మూడేళ్లుగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో విచారణ జరుగుతోంది.

ప్రభుత్వ రంగ సంస్థల దివాలా ప్రక్రియపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. అక్కడ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాం. మరోవైపు బొగ్గు సరఫరా, ఇతర సంస్థలకు బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. వడ్డీ సహా బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి’’ అని పిటిషన్‌లో ఏపీ జెన్‌ కో వెల్లడించింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన రూ.3,441 కోట్ల బకాయిలు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఏపీ జెన్ కో పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబరు 28కి వాయిదా వేసింది.