సలహాదారుల నియామకంలో ఏపీ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇకపై మంత్రులకు మాత్రమే సలహాదారులను నియమిస్తామని స్పష్టం చేసింది. శాఖలకూ సలహాదారులను నియమించడాన్ని గతంలో హైకోర్టు తూర్పారబట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.
సలహాదారుల నియామకాలపై.. విధాన రూపకల్పన చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత జీవో విడుదల చేస్తామని న్యాయస్థానానికి వివరించింది. వారూ అవినీతి నిరోధక చట్టంలోని పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం కిందికి వస్తారని తెలిపింది.
దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి నియామకాల్ని సవాలు చేస్తూ వేర్వేరుగా దాఖలైన పిటిషన్లకు సంబంధించి.. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు హైకోర్టులో అదనపు అఫడవిట్ దాఖలు చేశారు.ఇకపై సలహాదారులుగానీ, ప్రత్యేక సలహాదారులుగా నియమితులయ్యే వారిని సంబంధిత మంత్రులకు సలహాదారులుగా నియమిస్తామని పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టులో నైపుణ్యం ఆధారంగా ఈ నియామకం ఉంటుందన్నారు.