ప్రజలు, ప్రజాసంఘాలు ఎన్ని ఆందోళనలు చేపట్టినా చెత్త సేకరణ (Garbage collection) పై పన్ను విషయంలో జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా జులై 15 నుంచి వ్యర్థాల సేకరణపై పన్ను వసూలు చేయాలని ఏపీ పభుత్వం నిర్ణయించింది. రెండు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మున్సిపల్ శాఖ సన్నాహాలు చేస్తోంది.
మొదటి దశలో 16 కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన కార్పోరేషన్లు, మున్సిపాలిటీలల్లో రెండు చొప్పున మొత్తం 90 డివిజన్లు, వార్డుల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వీటి ఫలితాల ఆధారంగా మిగతా డివిజన్లు, వార్డులకు కార్యక్రమాన్ని విస్తరిస్తారు. రెండో దశలో రాష్ట్రంలో మిగిలిన 68 ప్రథమ, ద్వితీయ, తృతీయ గ్రేడ్ పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చెత్తపై పన్ను వసూలు చేయనున్నారు.
కాగా వ్యర్థాల సేకరణపై పన్ను విషయంలో పాలకవర్గం అనుమతి తీసుకోని ప్రాంతాల్లో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం పొందాలని పట్టణ, స్థానిక సంస్థల కమిషనర్లను మున్సిపల్ శాఖ ఆదేశించింది. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కో చోట ఒక్కో విధంగా వినియోగ రుసుములను నిర్ణయిస్తున్నారు. ఇళ్ళు, అపార్ట్ మెంట్లు, వాణిజ్య దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఒక్కో కేటగిరికి ప్రాంతాన్ని బట్టి పన్ను వసూలు చేయనున్నారు.