సాధారణంగా రాజకీయ నాయకులు తప్పులు ఒప్పుకోరు! తప్పు తమదే అన్న విషయం జనాలతో పాటు వారికి తెలిసినా కూడా… అడ్డంగా బొంకడం… రాజకీయ ప్రత్యర్థులపై వేయడం.. మరికొన్ని సార్లు అధికారులపైకి నెట్టేయడం చేస్తుంటారు. ఇలాంటి రాజకీయనాయకులు కోకొల్లలుగా ఉన్న ఈ రోజుల్లో… “తప్పు జరిగింది.. నన్ను క్షమించండి” అంటూ ఏపీ హోంమంత్రి సుచరిత అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అవును… “తప్పుజరిగింది.. నన్ను క్షమించండి” అని ఏపీ హోంమంత్రి ప్రజలను కోరడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది! అందుకు కారణమైంది సమాధుల కూల్చివేత సంఘటన. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సమాధులు కూల్చిన శ్మశాన వాటినకను సందర్శించిన అనంతరం స్పందించిన హోంమంత్రి… సమాధుల కూల్చివేత ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపారు.
ఇదే సమయంలో సమాధులను కూల్చడం అనే సంఘటన పొరపాటున జరిగిందని. ఫలితంగా సంబంధిత కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని.. జరిగిన పొరపాటుకు పెద్ద మనసు చేసుకొని క్షమించమని కోరుతున్నట్లు ఆమె తెలిపారు! దీంతో… తప్పు ఒప్పుకోవడం చిన్న విషయం కాదని… ఆమె ఇలా ప్రజలను బహిరంగంగా క్షమాపణలు కోరడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు!!
-CH Raja